: చంద్రబాబు తలంటుతో కార్యరంగంలోకి కొల్లు!... అధిక ధరలకు మద్యం అమ్మితే చర్యలేనని హెచ్చరిక
ఏపీలో మద్యం అమ్మకాల్లో చేతివాటం ప్రదర్శిస్తున్న వైన్ షాపుల యాజమాన్యాలపై ఆ రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. నిన్న టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో భాగంగా ఎమ్మార్పీ ధరలు ఎక్కడా అమలుకావడం లేదని ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అక్కడికక్కడే మంత్రి కొల్లు రవీంద్రను నిలదీశారు. శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతే ఎలాగంటూ అక్షింతలు వేశారు. దీంతో నేటి ఉదయమే రంగంలోకి దిగిన కొల్లు రవీంద్ర విజయవాడలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరిపితే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన వైన్ షాపులకు హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మార్పీ ధరలను అమలు చేయని వైన్ షాపుల లైసెన్స్ లను రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోమని కొల్లు చెప్పారు.