: 'నీట్' నుంచి తెలుగు రాష్ట్రాల మినహాయింపుపై నేడు సుప్రీంలో విచారణ.. విద్యార్థుల్లో ఉత్కంఠ
దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి ఒకే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను మినహాయించాలని కోరుతూ.. తెలుగు రాష్ట్రాలు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం విధితమే. ఈ అంశంపై సుప్రీం ఈరోజు విచారించనుంది. తెలుగు రాష్ట్రాలకున్న ప్రత్యేక హక్కులను సుప్రీంలో ప్రస్తావించనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు జమ్మూకశ్మీర్, తమిళనాడు తదితర రాష్ట్రాలు కూడా ఈ అంశంపై సుప్రీంను ఆశ్రయించాయి. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశామని ప్రవేశపరీక్షలను యథాతథంగా జరుపుకునేందుకు అనుమతినివ్వాలని కోరనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు నీట్‌పై విచారణ జరగనుంది. వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తోన్న విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో సుప్రీం నీట్‌పై ఈరోజు ఎటువంటి ప్రకటన చేస్తుందోనన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది.