: కాంగ్రెస్ ను గద్దెక్కించేందుకు ఉత్తరప్రదేశ్ లో 'బ్రాహ్మణుడు' ఎందుకు... ప్రశాంత్ కిషోర్ కొత్త ప్లాన్ ఏంటి?
ఓ తెలివైన టెక్ వ్యూహకర్తగా, నరేంద్ర మోదీని ప్రధాని పదవికి దగ్గర చేసి, ఆపై నితీశ్ కుమార్ ను బీహార్ పీఠం ఎక్కించిన ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు కాంగ్రెస్ వైపు నిలిచి, వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు దశాబ్దాల క్రితం కోల్పోయిన అధికారాన్ని తిరిగి సాధించేందుకు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. యూపీలో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా, ప్రియాంక, రాహుల్ గాంధీల్లో ఒకరిని ప్రకటించాలని, లేకుంటే ఓ బ్రాహ్మణ అభ్యర్థిని ఎన్నుకోవాలని ఆయన కాంగ్రెస్ హైకమాండ్ కు స్పష్టం చేశారు కూడా. వచ్చే సంవత్సరంలోగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపడతారన్న ఊహాగానాలు చెలరేగుతున్న వేళ, ఆయన యూపీ సీఎం అభ్యర్థిగా ఓ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కావడం కుదరకపోవచ్చు. ఇక ప్రియాంకాగాంధీ ఇంతవరకూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎన్నడూ రాలేదు. ఆమె కూడా నిరాకరిస్తే, ప్రశాంత్ సూచన మేరకు ఓ బ్రాహ్మణ అభ్యర్థిని కాంగ్రెస్ ఎంచుకోవాల్సి వుంటుంది. బ్రాహ్మణ అభ్యర్థిని ప్రకటించాలని కోరడం వెనుక ఆయన ఎంతో గ్రౌండ్ వర్క్ చేశారని తెలుస్తోంది. యూపీలో బ్రాహ్మణుల సంఖ్య 13 శాతం. ముఖ్యమంత్రిగా బ్రాహ్మణుడిని ప్రకటిస్తే, వారి ఓట్లన్నీ గంపగుత్తగా పడతాయన్నది ప్రశాంత్ అభిమతం. ఇదే సమయంలో సంప్రదాయ ముస్లిం ఓట్లు కాంగ్రెస్ వైపే ఉంటాయని కూడా ఆయన భావిస్తున్నారు. ఆయన టీమ్ ఇప్పటికే యూపీలో క్షేత్ర స్థాయిలో ఎంతో రీసెర్చ్ చేసినట్టు తెలుస్తోంది. కనీసం 27 శాతం నుంచి 28 శాతం ఓట్లను సంపాదించగలిగితే, చతుర్ముఖ పోటీలో విజయం ఖాయమని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తూ, గత నెలన్నరగా, యూపీలోని మీడియాకు కాంగ్రెస్ పార్టీని మరింత దగ్గర చేసే ప్రయత్నాలు చేస్తూ, రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతల వార్తలు ఏవో ఒకటి పేపర్లలో కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ తో పాటు మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, ములాయం నేతృత్వంలోని ఎస్పీ, బీజేపీలు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న నేపథ్యంలో ప్రశాంత్ రంగంలోకి దిగి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ప్రభుత్వాలు తమను విస్మరించాయని యూపీలోని బ్రాహ్మణులు భావిస్తున్నారని, అందువల్ల బ్రాహ్మణ అభ్యర్థిని ప్రకటించి, ఆపై ముస్లింలకు అధిక సీట్లు ఇచ్చి, ఆ వర్గాలకు దగ్గర కావాలని, ఇదే సమయంలో వెనుకబడిన తరగతుల ప్రజల్లో, దళితేతరులకు పెద్దపీట వేయడం ద్వారా వారి ఓట్లను చీల్చవచ్చన్న ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తోంది. 80 పార్లమెంట్ స్థానాలున్న రాష్ట్రంలో కేవలం రెండు సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తేవడం క్లిష్టమే అయినప్పటికీ, తన వ్యూహ చతురతతో దాన్ని సాధ్యమైనంత సులభం చేయాలన్నది ప్రశాంత్ కిషోర్ అభిమతంగా కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానించాయి.