: ఏజీ ఆఫీస్ లో ఫైర్ యాక్సిడెంట్!... దగ్ధమైన కీలక డాక్యుమెంట్లు
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులోని ఏజీ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో కార్యాలయంలోని కీలక డాక్యుమెంట్లు దగ్ధమయ్యాయన్న విషయం అధికారులను కలవరానికి గురి చేస్తోంది. వివరాల్లోకెళితే... నగరంలోని లక్డీకాపూల్ లోని ఏజీ ఆఫీసుకు చెందిన భవంతిలోని మూడో ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు ఆ ఫ్లోర్ మొత్తానికి విస్తరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే ఆ ఫ్లోర్ లోని ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయింది. ఇక పలు కీలక డాక్యుమెంట్లతో పాటు కంప్యూటర్లు కూడా కాలిబూడిదయ్యాయి.