: సమ ఉజ్జీల మధ్య ఆసక్తికర పోరు... బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదిక!


ఐపీఎల్ సీజన్ 9లో భాగంగా రెండు సమఉజ్జీల మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా 30వ టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో రెండు జట్లు టైటిల్ ఫేవరేట్లుగా పరిగణించబడుతున్నాయి. అయితే కోల్ కతా నైట్ రైడర్స్ అంచనాలకు తగ్గట్టు విజయాలతో పాయింట్ల పట్టికలో దూసుకుపోతుండగా, టైటిల్ ఫేవరేట్ గా టోర్నీలో అరంగేట్రం చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. బ్యాటింగ్ లో బెంగళూరు పటిష్ఠంగా ఉంది. జట్టులో కీలక ఆటగాళ్లు కోహ్లీ, డివిలియర్స్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లుగా దూసుకుపోతున్నారు. గేల్, వాట్సన్ వారికి జత కలిస్తే ప్రత్యర్థి ఎవరైనా బెంగళూరును ఓడించడం అసాధ్యమే. అయితే ఈ జట్టు బౌలింగ్ పరంగా పేలవంగా ఉంది. వరుణ్ ఆరోన్, వాట్సన్, బిన్నీ, చాహల్ ఎవరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. దీంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించినా, విజయం సాధించడంలో వెనకబడుతోంది. కోల్ కతా జట్టులో ఓపెనర్లు ఊతప్ప, గంభీర్ లు రాణిస్తుండడంతో ఇతర బ్యాట్స్ మన్ రిలాక్స్ అవుతున్నారు. అదే సమయంలో ఆ జట్టు బౌలింగ్ విభాగం మోర్కెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, పియూష్ చావ్లా ఆకట్టుకుంటున్నారు. దీంతో కోల్ కతా పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది. అవుట్ ఫీల్డ్ చిన్నదిగా ఉండడానికి తోడు, రెండు జట్ల ఆటగాళ్లు ఫాంలో ఉండడంతో ఈ మ్యాచ్ లో పరుగుల పండగ చోటుచేసుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News