: ఉత్తరాఖండ్ దావానలం వెనుక మాఫియా... నలుగురిని అరెస్ట్ చేశామన్న ప్రకాష్ జవదేకర్
దాదాపు 90 రోజులుగా ఉత్తరాఖండ్ లో వేలాది ఎకరాల విలువైన అటవీ భూమిని నాశనం చేసిన కార్చిచ్చు వెనుక మాఫియా హస్తం ఉందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. ఈ కేసుతో సంబంధమున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఉత్తరాఖండ్ లోని పలు జిల్లాల్లో 3 వేల హెక్టార్ల అటవీ భూములు అగ్నికి ఆహుతి కాగా, ఇప్పటివరకూ ఏడుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మంటలను మరింతగా విస్తరించకుండా అడ్డుకునేందుకు సైన్యంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. అడవిలో విలువైన చెట్లను నరికే మాఫియా సభ్యులు ఎక్కడికక్కడ నిప్పు పెడుతుండటంతోనే మంటలు చెలరేగాయని జవదేకర్ తెలిపారు.