: పొంగులేటికి అరుదైన గౌరవం!... వైసీపీ నేతకు ఎదురెళ్లి స్వాగతం పలకనున్న కేటీఆర్!
ఖమ్మం పార్లమెంటు సభ్యుడు, వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అరుదైన గౌవరం దక్కనుంది. ఇప్పటిదాకా ఒక పార్టీలో నుంచి మరో పార్టీలోకి చేరిన నేతలు... కొత్తగా చేరిన పార్టీ అధినేత వద్దకెళ్లి ఆ పార్టీల్లో చేరిపోయారు. వీరందరిలోకి పొంగులేటి భిన్నం. జంపింగ్ నేతల్లో ఏ ఒక్కరికి దక్కని అరుదైన గౌరవం ఆయనకు దక్కనుంది. రాజకీయాల్లో మచ్చలేని నేతగానే కాక సహృదయుడిగా పేరుపడ్డ పొంగులేటి ఎక్కడున్నా ప్రత్యేకమే. తెలంగాణ సెంటిమెంట్ బలంగా పనిచేసిన సమయంలోనే ఆయన తెలంగాణను వ్యతిరేకించిన వైసీపీ టికెట్ పై బరిలోకి దిగి, వామపక్షాలు, టీడీపీకి కంచుకోటగా ఉన్న ఖమ్మం పార్లమెంటులో ఘన విజయం సాధించి సత్తా చాటారు. తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. రాజకీయాల్లోనే ప్రత్యేకత కలిగిన నేతగా పొంగులేటికి ఘనంగా స్వాగతం పలకాలని గులాబీ దళం నిర్ణయించింది. ఇందులో భాగంగానే పొంగులేటి ఇంటికి కాసేపట్లో టీఆర్ఎస్ యువత నేత, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పొంగులేటికి కేటీఆర్ తమ పార్టీలోకి రావాలని ఎదురేగి స్వాగతం పలకనున్నారు. తదనంతరం ఈ నెల 4న పొంగులేటి... పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (వైసీపీ)తో కలిసి కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు.