: వైఎస్ జగన్ ‘పోరుబాట’కూ అనుమతి లేదట... మాచర్లలో ఉద్రిక్తత తప్పదా?
ఏపీలో కరవుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ వైసీపీ చేపట్టిన ‘పోరుబాట’కు అడుగడుగునా అడ్డంకులు తగులుతున్నాయి. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో వైసీపీ నేతలు వేసిన ధర్నా టెంట్లను పోలీసులు పీకేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పాలుపంచుకోనున్న ధర్నాకు కూడా పోలీసుల అనుమతి లేదని తేలిపోయింది. గుంటూరు జిల్లాలోని మాచర్లలో జరగనున్న ధర్నాలో పాల్గొనాలని జగన్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేటి ఉదయం రోడ్డు మార్గం మీదుగా హైదరాబాదు నుంచి బయలుదేరిన జగన్... ఇప్పటికే గుంటూరు జిల్లాలోకి ఎంటరయ్యారు. మరికాసేపట్లో ఆయన మాచర్లకు చేరుకోనున్నారు. ధర్నా జరగనున్న ప్రదేశానికి జగన్ చేరుకోవడానికి కాస్తంత ముందుగా సదరు ధర్నాకు అనుమతి లేదని పోలీసులు తెలపడంతో వైసీపీ నేతలు షాక్ తిన్నారు. పోలీసులు అడ్డగించినా ధర్నా నిర్వహించి తీరాల్సిందేనన్న భావనతో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు అక్కడికి క్యూ కట్టారు. పరిస్థితిని అంచనా వేసిన పోలీసులు కూడా అంతే సంఖ్యలో అక్కడ మోహరించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.