: పంజాబ్ బౌలర్లు అదరగొట్టారు...గుజరాత్ కు చుక్కలు చూపించారు
ఐపీఎల్ సీజన్ 9 లో భాగంగా రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న 28వ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు మురళీ విజయ్ (55), స్టోయిన్స్ (27) శుభారంభం ఇవ్వగా, కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (31), సాహా (33) ఆదుకున్నారు. దీంతో 154 పరుగులకు పంజాబ్ అలౌట్ అయింది. దీంతో జోరుమీద ఉన్న గుజరాత్ దే విజయం అని అంతా భావించారు. అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ పంజాబ్ బౌలర్లు అద్భుతం చేశారు. బంతితో నిప్పులు చెరిగారు. తిరుగులేని లైన్ అండ్ లెంగ్త్ తో గుజరాత్ బ్యాట్స్ మన్ కు చుక్కలు చూపించారు. ఓపెనర్ మెక్ కల్లమ్ (1), ఆ తరువాత కెప్టెన్ రైనా (18) ను మోహిత్ శర్మ అద్భుతమైన బంతితో పెవిలియన్ కు పంపగా, వెంటనే మరో ఓపెనర్ స్మిత్ (15) ను అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. అదే ఊపులో దినేష్ కార్తిక్ (2), రవీంద్ర జడేజా (11), వెంటనే డ్వెన్ బ్రావో (0) ను కూడా అక్షర్ పెవిలియన్ కు పంపాడు. దీంతో గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఇషాన్ కిషన్ (17), జేమ్స్ ఫాల్కనర్ (3) క్రీజులో ఉన్నారు. 13 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో నాలుగు వికెట్లతో అక్షర్ పటేల్ రాణించగా, రెండు వికెట్లు తీసి మోహిత్ శర్మ రాణించాడు.