: కేసీఆర్ దేశం గర్వించదగ్గ నేత: నాయిని
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశం గర్వించదగ్గ నేత అని ఆ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కొనియాడారు. మేడే సందర్భంగా హైదరాబాదులోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో అవినీతి రహిత పాలన కోసం ముఖ్యమంత్రి నడుంబిగించారని అన్నారు. కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. మూతపడిన కాగజ్ నగర్ పేపర్ మిల్లును తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. కార్మికులు, యాజమాన్యం మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అప్పుడే పరిశ్రమలు లాభాల బాట పడతాయని ఆయన చెప్పారు.