: తమిళనాట తాజా సర్వే... డీఎంకే 124, అన్నాడీఎంకే 90!
తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలితకు పరాభవం తప్పదని, తదుపరి ప్రజలు డీఎంకేకు పట్టం కట్టనున్నారని చెన్నై లయోలా కాలేజ్ పూర్వ విద్యార్థులు చెబుతున్నారు. స్పష్టమైన మెజార్టీతో కరుణానిధి నేతృత్వంలోనీ డీఎంకే పీఠం అధిరోహించనుందని పూర్వవిద్యార్థుల సంఘం సమన్వయకర్త తిరునావుక్కరసు తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన, సర్వే వివరాలు తెలియజేస్తూ, డీఎంకేకు 124 సీట్లు లాభించనున్నాయని, అన్నాడీఎంకే 90 స్థానాలకు పరిమితం కానుందని వివరించారు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 28 మధ్య రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందిని సర్వేలో భాగంగా ప్రశ్నించామని తెలిపారు. జయలలితపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యే ప్రధాన పోటీ వుంటుందని అత్యధికులు వెల్లడించగా, డీఎండీకే, ప్రజా సంక్షేమ కూటమికి 16 శాతం మంది మద్దతు పలికారని వివరించారు. తృతీయ కూటమితో అన్నా డీఎంకే ఓట్లు చీలనుండటం, డీఎంకేకు వరం కానుందని వివరించారు. డీఎంకేకు 39.04 శాతం, అన్నాడీఎంకేకు 35.22 శాతం ఓట్లు రానున్నాయని అంచనా వేశారు.