: దివాలా దిశగా 'ఆస్క్ మీ'... 650 మంది ఉద్యోగుల రాజీనామా!
మలేషియాకు చెందిన ఆస్ట్రో, హీలియన్ వెంచర్ కాపిటల్ సంస్థలు సంయుక్తంగా ప్రారంభించిన స్థానిక వ్యాపార సేవలను ఇంటర్నెట్ మాధ్యమంగా అందించే 'ఆస్క్ మీ' మూతపడే దశకు చేరుకుంది. సంస్థలో నిధులు నిండుకోవడం, పెరుగుతున్న నష్టాలను చూసిన ఉద్యోగులు తమంతట తామే రాజీనామాలు చేసి వెళుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఆస్క్ మీ డాట్ కామ్ సంస్థకు 40 కార్యాలయాలుండగా, వీటిల్లో పనిచేస్తున్న వారిలో 650 మంది రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. వీరంతా సాలీనా రూ. 2.5 లక్షల నుంచి రూ. 6 లక్షల మధ్య వేతనాలున్న వారని తెలుస్తోంది. ప్రతి నెలా 6 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 39 కోట్లు) నష్టాన్ని సంస్థ భరిస్తున్నట్టు తెలుస్తోంది. తాము కష్టపడి పనిచేస్తున్నప్పటికీ, తగినంత వేతనాలు ఇవ్వడం లేదని ఉద్యోగులు వాపోతుండగా, ఆటోమేషన్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నామని, అవసరమైన విభాగాల్లో నిష్ణాతులను నియమిస్తామని సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా, కోల్ కతా కేంద్రంగా నడుస్తున్న సంస్థ కార్యాలయం ఎదుట రాజీనామాలు చేసిన ఉద్యోగులు, తమ బకాయిల కోసం నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. వీరిలో కొందరికి మాత్రం గెటిట్ ఇన్ఫోమీడియా (ఆస్క్ మీ పేరెంట్ కంపెనీ) గ్రూప్ సంస్థల్లో ఉద్యోగాలను ఆఫర్ చేయనున్నట్టు యాజమాన్యం వెల్లడించింది.