: హేమమాలినికి తృటిలో తప్పిన ప్రమాదం
పార్లమెంట్ సభ్యురాలు, అలనాటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని మధుర సమీపంలో ప్రయాణిస్తున్న ఆమె కాన్వాయ్ లో రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయని, హేమమాలిని క్షేమంగా ఉన్నారని మధుర ఎస్పీ ముకుల్ ద్వివేది వెల్లడించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె దీన్ దయాల్ ఉపాధ్యాయ్ వెటర్నరీ యూనివర్శిటీకి వెళుతున్నారని తెలిపారు. వేగంగా వెళుతున్న కాన్వాయ్ లోని ఓ వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగిందని, హేమమాలిని ప్రయాణిస్తున్న కారును వెనక వస్తున్న వాహనం ఢీకొట్టిందని వివరించారు. గత సంవత్సరం రాజస్థాన్ లో హేమ కాన్వాయ్ ఓ కారును ఢీకొనగా, నాలుగేళ్ల చిన్నారి మరణించిన సంగతి తెలిసిందే. ఆనాటి ప్రమాదంలో హేమమాలినికి సైతం గాయాలయ్యాయి.