: బీహార్ లో లిక్కర్ బ్యాన్!... యూపీ మద్యం షాపు విక్రయాలు అదుర్స్!


3 వేల శాతం మేర విక్రయాలు పెరిగాయా? నమ్మేదేనా?... నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఈ లెక్కలు చెబుతోంది ఏ అనధికారిక వ్యాపారో కాదు.. సాక్షాత్తు అబ్కారీ శాఖకు చెందిన ఉన్నతాధికారులు. బీహార్ లో అమల్లోకి వచ్చిన సంపూర్ణ మద్య నిషేధం పొరుగు రాష్ట్రాలకు అయాచిత వరంగా మారింది. ఇప్పటికే బీహార్ తో సరిహద్దు పంచుకుంటున్న జార్ఖండ్ లోని పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు పెరిగాయి. అదే సమయంలో ఆ రాష్ట్ర ఆబ్కారీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. తాజాగా ఉత్తరప్రదేశ్ వంతు వచ్చింది. బీహార్ సరిహద్దులోని యూపీ జిల్లా బల్లియాలోని భరౌలీ గ్రామానికి చెందిన ఓ మద్యం షాపు నిత్యం జనంతో కిటకిటలాడుతోంది. మందుతో గొంతు తడుపుకుందామని వస్తున్న బీహారీలతో ఆ మద్యం షాపు నిత్యం రద్దీగానే ఉంటోందట. ఈ కారణంగా సింగిల్ నెలలోనే ఆ మద్యం షాపు విక్రయాలు ఏకంగా 900 శాతం పెరిగాయట. ఇక ఈ గ్రామానికి సమీపంలోని గ్రామాల్లోనూ ఇదే తరహాలో 600 నుంచి 900 శాతం మేర విక్రయాలు పెరిగాయి. ఇక బీహార్ సరిహద్దులోని మరో యూపీ జిల్లా చందౌలీలోని భావ్ రాహా గ్రామానికి చెందిన మద్యం దుకాణంలో విక్రయాలు ఏకంగా 3 వేల శాతానికి పెరిగాయట. వెరసి బీహార్ లో అమల్లోకి వచ్చిన మద్య నిషేధం... ఆ రాష్ట్రానికి పొరుగు రాష్ట్రాలుగా ఉన్న జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లకు వర ప్రదాయినిగానే మారిందని చెప్పాలి.

  • Loading...

More Telugu News