: ముందు పరీక్ష జరగనీయండి!... ‘నీట్’పై విద్యార్థుల పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష పేరిట రంగప్రవేశం చేసిన ‘నీట్’ నిర్వహణపై సర్వోన్నత న్యాయస్థానం వెనకడుగు వేసే పరిస్థితులు కనిపించడం లేదు. రేపు పరీక్ష జరగనున్న నేపథ్యంలో రెండు రోజుల క్రితం నీట్ కు పచ్చజెండా ఊపిన సుప్రీం ధర్మాసనం నిన్న దాఖలైన రివ్యూ పిటిషన్లను కూడా కొట్టేసింది. ఇక తాజాగా నేటి ఉదయం నీట్ నిర్వహణపై పున:పరిశీలన జరపాలన్న విద్యార్థుల అభ్యర్థనను వినేందుకు కూడా సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేయలేదు. సీబీఎస్సీ, స్టేబ్ బోర్డుల సిలబస్ ల మధ్య భారీ వ్యత్యాసముందని, ఈ కారణంగా సీబీఎస్సీ సిలబస్ ఆధారంగా నిర్వహించే నీట్ లో తమకు అన్యాయం జరగడం ఖాయమని పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే విద్యార్థుల పిటిషన్లను విచారణకు కూడా స్వీకరించని కోర్టు... ముందైతే రేపు ఫస్ట్ ఫేజ్ పరీక్ష జరగనీయండి... ఆ తర్వాత పరిశీలిస్తామని చెప్పింది. దీంతో నీట్ వాయిదా పడుతుందని ఆశించిన స్టేట్ బోర్డుల సిలబస్ చదువుతున్న విద్యార్థుల ఆశలు అడియాశలే అయ్యాయి.