: అద్దంకిలో మరోమారు హైటెన్షన్!... గొట్టిపాటి ఫ్లెక్సీల చించివేత, ఆందోళనకు దిగిన ఎమ్మెల్యే వర్గం
ప్రకాశం జిల్లా అద్దంకిలో మరోమారు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ టికెట్ పై గడచిన ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గ బరిలోకి దిగి విజయం సాధించిన గొట్టిపాటి రవికుమార్... ఇటీవలే టీడీపీలో చేరిపోయారు. అయితే గొట్టిపాటి ప్రత్యర్థి వర్గమైన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం వర్గం మాత్రం ఈ చేరికను అడ్డుకునేందుకు అన్ని రకాల యత్నాలు చేసింది. చంద్రబాబు సర్దిచెప్పడంతో కరణం కాస్తంత మెత్తబడగా, గొట్టిపాటి సైకిలెక్కేశారు. సుదీర్ఘ కాలంగా ప్రత్యర్థులుగా కొనసాగుతూ వస్తున్న కరణం, గొట్టిపాటిలు ఒకే పార్టీలో చేరినా... వారి మధ్య మనస్పర్ధలు మాత్రం చల్లారలేదు. ఇందుకు నిదర్శనంగానే గొట్టిపాటి టీడీపీలో చేరే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు చించేశారు. దీంతో టీడీపీలోకి గొట్టిపాటి చేరిన రోజే కలకలం రేగింది. తాజాగా నేటి ఉదయం కూడా అద్దంకిలో గొట్టిపాటి ఫ్లెక్సీలు చిరిగిపోయి ఉండటాన్ని గమనించిన ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఈ ఘటనకు నిరసనగా వారు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న గొట్టిపాటి కూడా మీడియా ముందుకు వచ్చి ఫ్లెక్సీల చించివేతను ఆకతాయిల పనిగా అభివర్ణించారు. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే... చూస్తూ ఊరుకోబోమని కూడా ఆయన కాస్తంత ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఫ్లెక్సీల చించివేత, గొట్టిపాటి వ్యాఖ్యల నేపథ్యంలో అద్దంకిలో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.