: ‘హోదా’పై కేంద్రం ప్రకటనపై భగ్గుమన్న నవ్యాంధ్ర!... ఉద్యమాలకు సిద్ధమవుతున్న పార్టీలు, ప్రజా సంఘాలు


ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరమేమీ లేదని, నీతి ఆయోగ్ కూడా ఇదే చెప్పిందన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చౌధురి నిన్న చేసిన సంచలన ప్రకటనపై నవ్యాంధ్ర భగ్గుమంది. మంత్రి ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే రంగంలోకి దిగిన సినీ నటుడు శివాజీ... బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ఏపీని నట్టేట ముంచేందుకు యత్నిస్తున్న కేంద్ర కేబినెట్ నుంచి రాష్ట్రంలోని అధికార పార్టీ టీడీపీ బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ సహా అన్ని రాజకీయ పార్టీలు కేంద్రం వైఖరిని ఖండించాయి. ఇక ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వ ప్రకటనకు నిరసనగా ఉద్యమాల హోరు వినిపించేందుకు సమాయత్తమవుతున్నాయి. ఈ మేరకు ఆయా పార్టీలు తమ కార్యవర్గాలతో చర్చల్లో మునిగిపోయాయి. అయితే ఉమ్మడిగా ఉద్యమంలోకి దిగుదామంటూ పలు ప్రజా సంఘాలు ఇస్తున్న పిలుపునకు పలు పార్టీల నుంచి ఆశించిన మేర స్పందన రావడం లేదని తెలుస్తోంది. సొంతంగానే ఉద్యమాలు చేద్దామన్న ఆయా పార్టీలు భవిష్యత్తులో తమతో కలిసిరాక తప్పదని ప్రజా సంఘాలు వాదిస్తున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడిగానైనా, విడివిడిగానైనా... ‘హోదా’ కోసం ఏపీలో ఉద్యమాలు హోరెత్తడం మాత్రం ఖాయమేనని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News