: వెంకయ్యకు ఈసారి ఏపీ నుంచే రాజ్యసభ సీటు... కర్ణాటక నుంచి ఛాన్స్ లేనట్టే!


బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు రాజ్యసభ సభ్యత్వం జూన్ 30తో ముగియనుంది. ప్రస్తుతం పొరుగు రాష్ట్రం కర్ణాటక కోటా నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న వెంకయ్య... ఈ దఫా మాత్రం తన సొంత రాష్ట్రం ఏపీ నుంచి ఆ సభకు ఎంపిక కానున్నారు. ఈ విషయంలో ఇప్పటికిప్పుడు అంతగా స్పష్టత లేకున్నా... రాజ్యసభ సీటు కోసం ఆయన తన సొంత రాష్ట్రాన్ని ఆశ్రయించక తప్పని పరిస్థితులున్నాయని విశ్లేషకుల అంచనా. వివరాల్లోకెళితే... కర్ణాటక నుంచి పెద్దల సభకు ఎన్నికైన వెంకయ్యతో పాటు విజయ్ మాల్యా, ఆస్కార్ ఫెర్నాండెజ్, అయనూరు మంజునాథల పదవీకాలం జూన్ 30తో ముగుస్తోంది. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలోని బలాబలాల ఆధారంగా... ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రెండు ఎంపీ సీట్లు, విపక్షంలో ఉన్న బీజేపీకి ఓ సీటు సులభంగానే దక్కనున్నాయి. ఇక మిగిలిన సీటు కోసం కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశాలున్నాయి. బీజేపీ కచ్చితంగా గెలిచే అవకాశమున్న సింగిల్ సీటును ఆ రాష్ట్ర పార్టీ శాఖ కొత్త చీఫ్ బీఎస్ యడ్యూరప్పకు అత్యంత సన్నిహితుడిగా పేరుపడ్డ అయనూరు మంజునాథకు కేటాయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ దఫా రాజ్యసభ సభ్యత్వం కోసం వెంకయ్య కర్ణాటక నుంచి కాకుండా తన సొంత రాష్ట్రం ఏపీకి తరలిరానున్నట్లు ప్రచారం సాగుతోంది.

  • Loading...

More Telugu News