: మా బాధ మీకేం తెలుసు?: జైరాం రమేష్ పై జేడీ శీలం ఆగ్రహం
‘మా బాధ మీకేం తెలుసు?’ అంటూ సొంత పార్టీ నేత జైరాం రమేష్ పై కాంగ్రెస్ నేత జేడీ శీలం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చ జరిగింది. విభజన బిల్లు సమయంలో ఏపీ నేతలు ప్రస్తావించిన అంశాలను అప్పటి కేంద్రం పట్టించుకోలేదన్న శీలం వ్యాఖ్యలపై జైరాం రమేష్ అభ్యంతరం తెలిపారు. దీంతో వారి మధ్య స్వల్ప వివాదం జరిగింది. ‘డ్రాఫ్ట్ సమయంలో వచ్చిన మీకేం తెలుసంటూ’ జైరాం రమేష్ పై శీలం విరుచుకుపడ్డారు. అనంతరం జేడీ శీలం మాట్లాడుతూ, ఏపీ రెవెన్యూ లోటును కేంద్రమే భర్తీ చేయాలని, రాష్ట్ర ఆర్థిక లోటుకు సంబంధించి కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. రెవెన్యూ లోటును భర్తీ చేస్తామన్న హామీని కేంద్రం నెరవేర్చలేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పేదొకటి .. చేసేదొకటి అంటూ జేడీ శీలం మండిపడ్డారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి కేంద్రం పైసా ఇవ్వలేదని, ఏపీకి అరకొర నిధులిచ్చి కేంద్రం చేతులు దులుపుకుంటోందని శీలం విమర్శించారు.