: అగస్టా నుంచి సోనియాకు ముడుపులు!... కాంగ్రెస్ అధినేత్రి వాటిని ఎక్కడ దాచారో కూడా చెప్పిన సుబ్రహ్మణ్య స్వామి
వీవీఐపీల కోసం కొనుగోలు చేసిన అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ నేతలకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయని బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. ఈ ముడుపులను సోనియా గాంధీ ఎక్కడ దాచారన్న విషయాన్ని కూడా చెప్పి స్వామి నిన్న ‘ఏబీపీ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అగస్టా నుంచి తీసుకున్న ముడుపులను సోనియా గాంధీ... జెనీవాలోని ‘సరసిన్ బ్యాంక్’లో దాచుకున్నారని స్వామి చెప్పారు. తర్వాత ఇందులో కొంత మొత్తాన్ని అక్కడి నుంచి తరలించిన సోనియా గాంధీ... ‘పిక్ టెట్ బ్యాంకు’లో డిపాజిట్ చేశారన్నారు. ఈ రెండు బ్యాంకుల ఖాతాలను పరిశీలించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోనియా గాంధీపై కేసులు నమోదు చేయాలని స్వామి డిమాండ్ చేశారు.