: బుడ్డా రాజశేఖరరెడ్డి జంపింగ్... కర్నూలు జిల్లాలో టీడీపీ బలాన్ని వైసీపీకి సమానం చేసింది!


శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్దా రాజశేఖరరెడ్డి పార్టీ మార్పు... కర్నూలు జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది. వైసీపీ బలంతో తూగలేని టీడీపీని ఒక్కసారిగా విపక్ష పార్టీకి సరిసమాన స్థాయికి చేర్చింది. గడచిన ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో అటు వైసీపీతో పాటు ఇటు టీడీపీ కూడా పోటీ చేసింది. రెడ్డి సామాజిక వర్గానికి గట్టి పట్టున్న ఆ జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. మొత్తం 14 సీట్లలో ఆ పార్టీ 11 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇక మిగిలిన మూడు నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. తాజాగా టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’కు తొలుత కర్నూలు జిల్లాలోనే తెర లేచింది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి... తన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో కలిసి తన సొంత గూడు టీడీపీకి చేరిపోయారు. ఆ తర్వాత కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ కూడా సైకిలెక్కేశారు. అప్పటికీ జిల్లాలో వైసీపీనే బలంగా ఉంది. ముగ్గురు ఎమ్మెల్యేలు చేజారగా... జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలతో ఆ పార్టీకి టీడీపీ కంటే ఓ స్థానం అధికంగా ఉంది. ఈ క్రమంలో నిన్న బుడ్డా రాజశేఖరరెడ్డి జగన్ కు ఝలక్కిచ్చి టీడీపీలో చేరిపోయారు. దీంతో జిల్లాలో ఇరు పార్టీలకు సరిసమాన సంఖ్యలో ఏడుగురు చొప్పున ఎమ్మెల్యేలున్నట్లు లెక్క తేలింది. ఇక వైసీపీ జిల్లా కన్వీనర్ గా ఉన్న బుడ్డా... పార్టీ వీడటంతో ఆ పార్టీ కొత్తగా జిల్లా కన్వీనర్ ను నియమించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వెరసి బుడ్డా చేరికతో టీడీపీ... కర్నూలు జిల్లాలో వైసీపీ కంటే కాస్తంత మెరుగైన పరిస్థితికి చేరింది.

  • Loading...

More Telugu News