: కాసేపట్లో ఏపీ ఎంసెట్!... నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
ఏపీలో ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చరల్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న ఎంసెట్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా నీట్ ను అమలు చేయాలని నిన్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా... అప్పటికే షెడ్యూల్ ప్రకటించి, ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యంలో ఎంసెట్ నిర్వహణకే ఏపీ సర్కారు మొగ్గుచూపింది. ఏపీతో పాటు తెలంగాణలోని పలు కేంద్రాల్లో మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ ఎంసెట్ లో భాగంగా... ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజినీరింగ్ పరీక్ష జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మెడిసిన్ పరీక్ష జరగనుంది. గంట ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తున్న అధికారులు 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించరు. మరోవైపు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి.