: కుత్తుక కోస్తానన్నాడు!... ఆవేశం కట్టలు తెంచుకుంది!: ‘ఒకే ఓవర్ లో ఆరు సిక్స్’లకు ముందు కథ చెప్పిన యువీ!


భారత క్రికెట్ చరిత్రలో మరపురాని ఇన్నింగ్స్ ఎన్నో ఉన్నాయి. అప్పటిదాకా పసికూనగా ఉన్న కపిల్ డెవిల్స్.. వరల్డ్ చాంపియన్ గా వెలుగొందుతున్న వెస్టిండీస్ ను మట్టి కరిపించి తొలిసారి వరల్డ్ కప్ ను భారత్ కు తెచ్చారు. ఇది వన్డే క్రికెట్ చరిత్రలో మరిచిపోలేని ఘట్టం. ఇక పొట్టి క్రికెట్ టీ20 ఫార్మాట్ లో తొలి వరల్డ్ కప్ టైటిల్ నే ధోనీ సేన ఎగరేసుకువచ్చింది. దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ సిరీస్ లో టీమిండియా విజేతగా నిలిచింది. జట్టు ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ వీరవిహారం... సగటు భారత క్రికెట్ అభిమానే కాకుండా ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన అభిమాని కూడా మరిచిపోడు. ఎందుకంటే సదరు సిరీస్ లో ఇంగ్లండ్ తో డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో యువీ... ఒక ఓవర్ లో ఆరు బంతులను ఆరు సిక్స్ లుగా మలిచాడు. యువీ బాదుడుతో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బిక్కచచ్చిపోయాడు. కొన్ని రోజుల పాటు అతడు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. అయితే ఆ మ్యాచ్ లో యువీతో ఇంగ్లండ్ జట్టు సభ్యులు స్లెడ్జింగ్ కు దిగారు. ప్రత్యేకించి ఆండ్రూ ప్లింటాఫ్, యువీల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరినొకరు తిట్టిపోసుకున్నారు. అసభ్యకరమైన పదాలు వాడారు. ఈ గొడవతోనే రెచ్చిపోయిన యువీ బ్రాడ్ బౌలింగ్ ను తుత్తునియలు చేశాడు. అయితే ప్లింటాఫ్, యువీల మధ్య జరిగిన గొడవ గురించి మాత్రం పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. ఇన్నాళ్లకు ఆ గొడవలో జరిగిన సంభాషణను యువీ... ఓ టీవీ షో సందర్భంగా బహిర్గతం చేశాడు. వాదులాటలో ఇద్దరి సంభాషణను చెప్పిన యువీ... తాము వాడిన అభ్యంతరకర పదాలను మాత్రం రివీల్ చేయడానికి ఇష్టపడలేదు. ‘నీ షాట్లు హాస్యాస్పదంగా ఉన్నాయి అని ఫ్లింటాఫ్‌ అన్నాడు. ఎందుకంటే అంతకుముందు అతని బౌలింగ్‌లో రెండు బౌండ్రీలు కొట్టా. దీంతో నేను ఘాటుగా బదులిచ్చా. ఏం మాట్లాడుతున్నావని ఫ్లింటాఫ్‌ ప్రశ్నించాడు. నేనేం అన్నానో నువ్వు విన్నావని చెప్పా. దాంతో నీ గొంతు కోసేస్తా అంటూ అతను హెచ్చరించాడు. నా చేతిలో ఉన్న బ్యాట్‌ చూశావుగా. దాంతో నిన్ను ఎక్కడ కొడతానో తెలుసుగా? అని అతనికి బదులిచ్చా’ అని యువీ పేర్కొన్నాడు. ఈ గొడవతో తనలో ఆవేశం కట్టలు తెంచుకుందని, బ్రాడ్ బౌలింగ్ ను చితకబాదానని యువీ చెప్పాడు. ‘ఆ ఘటన నాకు మంచే చేసింది. నేను చాలా ఆవేశానికి గురయ్యా. ప్రతీ బంతిని స్టేడియం అవతలకు బాదాలనుకున్నా. కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు మనకు మంచి చేస్తాయి. ఒక్కోసారి ప్రతికూలంగా మారుతాయి. కానీ, ఆ రోజు మాత్రం అది ప్రత్యర్థులను దెబ్బతీసిందని అనుకుంటున్నాను’అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News