: మాంఝీ స్ఫూర్తి... అమ్మకోసం బావి తవ్విన కొడుకు!
ఇరవై రెండేళ్లపాటు కష్టపడి ఒక కొండను తవ్వి గ్రామానికి రోడ్డు వేసిన బీహార్ దళితుడు దశరథ్ రామ్ మాంఝీ ఆ యువకుడికి స్ఫూర్తిగా నిలిచాడు. ఎందుకో తెలుసా? తన ఇంటి పెరటిలో బావి తవ్వే విషయంలో! ఆ యువకుడు అసలు బావి ఎందుకు తవ్వాల్సి వచ్చిందంటే... కర్ణాటకలోని సెట్టిసార గ్రామంలో మంచి నీటి కష్టాలు ఉన్నాయి. గుక్కెడు నీళ్ల కోసం చాలా దూరం వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అందరిలాగానే, పదిహేడేళ్ల యువకుడు పవన్ కుమార్ తల్లి కూడా అన్ని కిలోమీటర్లు వెళ్లి నీళ్లు తీసుకువస్తూ ఉండేది. ఇదంతా గమనిస్తున్న పవన్ కు బాధేస్తూ ఉండేది. దీనికి పరిష్కారం ఇంటి పెరటిలో ఒక బావి తవ్వుకోవడమేనని అనిపించింది. కానీ ఆర్థిక స్తోమత లేదు. తన తల్లి ఒక ప్రింటింగ్ ప్రెస్ లో, తండ్రి వంటవాడిగా పని చేస్తుంటారు. వారి సంపాదన మొత్తం కలిపినా కూడా ఇంటి ఖర్చులకే సరిపోతుంది. అయితే, తన తల్లి కోసం ఎలా అయినా సరే, బావి తవ్వాలనే ఆలోచనకు ‘మాంఝీ స్ఫూర్తి’ మరింత బలాన్నిచ్చింది.. సంకల్పంగా రూపుదిద్దుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన తమ ఇంటి వెనుక బావి తవ్వడం మొదలుపెట్టాడు. మొత్తం 45 రోజుల పాటు శ్రమించగా 53 అడుగుల వద్ద గంగమ్మ తల్లి కరుణించింది. జలం ఉబికివచ్చింది. మరో రెండగులు తవ్వి తన పని ముగించి.. తన తల్లికి బావిని అప్పగించాడు. ఈ సందర్భంగా పవన్ కుమార్ తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ, తన తల్లి కోసం పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని, అది తనకు చాలా ఆనందంగా ఉందని అన్నాడు. తన కాలేజీ పరీక్షల నిమిత్తం ఒక పదిరోజుల పాటు బావి తవ్వే పనులకు దూరంగా ఉన్నానని చెప్పాడు.