: మనసులో మాట చెబుతున్నా!... పొగడ్త అనుకుంటే నేనేమీ చేయలేను!: చంద్రబాబుతో జేసీ దివాకర్ రెడ్డి
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి అంకితభావంపై ఆ పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కొద్దిసేపటి క్రితం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన చేరిక సభకు వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి తన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాలనలో నిమగ్నమైన చంద్రబాబు... తన మనవడితో కూడా సరదాగా గడపలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేసుకుపోతున్న చంద్రబాబు కర్మయోగిలా మారారని కూడా జేసీ అన్నారు. ఈ వ్యాఖ్యలకు ముందు చంద్రబాబు వైపు తిరిగిన జేసీ... ‘‘నా మనసులోని మాట చెబుతున్నా. దానిని మీరు పొగడ్త అనుకుంటే నేనేమీ చేయలేను’’ అంటూ వ్యాఖ్యానించారు. భార్య, కొడుకు, కూతురు కంటే... మనవడు, మనవరాలితో గడిపే క్షణాలు ఏ వ్యక్తి జీవితంలోనైనా ప్రత్యేకమైనవేనని జేసీ చెప్పారు. ఆ అనుభూతిని చంద్రబాబు పొందలేకపోతున్నారని ఆయన అన్నారు. ఇందుకు చంద్రబాబు కర్మయోగిగా మారడమే కారణమని కూడా ఆయన పేర్కొన్నారు. అసలు మీ మనవడితో ఎంతసేపు ఆడుకున్నారో చెప్పాలంటూ ఆయన చంద్రబాబును నిలదీశారు. జేసీ ప్రశ్నలకు స్పందించడానికి కాస్తంత ఇబ్బంది పడ్డ చంద్రబాబు మాట్లాడకుండా గంభీర వదనంతోనే కూర్చుండిపోయారు.