: పిల్లల విషయంలో అంతజాగ్రత్తగా ఉంటారు మరి!
అమెరికాలో పిల్లల ఆరోగ్యం, అపాయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంటారు. చట్టపరంగా ఈ జాగ్రత్తలు చాలా పటిష్టంగా ఉంటాయి. ఎంతగా అంటే.. పిల్లలకు బజార్లో అమ్ముతున్న బొమ్మలు ప్రమాదకరమైనవి అని అనిపిస్తే చాలు.. గత ఏడాది రోజుల్లో అమ్మిన మొత్తం బొమ్మలను తిరిగి వాపసు తెప్పించి.. వాటిని మార్కెట్‌లో లేకుండా చేసేంతగా.. పటిష్టమైన చట్టాలుంటాయి.
తాజాగా కూడా అదే జరిగింది. అయితే ఇక్కడ నిషేధానికి గురైనది.. భారత్‌లో తయారైన బొమ్మలు. పిల్లలకు హాని కలిగించేలా ఉన్నాయంటూ భారత్‌లో తయారైన కొన్ని రకాల బొమ్మల్ని అమెరికా నిషేధించింది. పర్యవసానంగా గత ఏడాది అక్టోబరు నుంచి అమ్మిన 2500 బొమ్మలను వెనక్కు తీసేసుకున్నారు. ఢిల్లీ నోయిడాలోని రేడియంట్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ అమెరికాలోని ఇలినాయిస్ ప్రాంతంలోని ఒక సంస్థకు ఆటబొమ్మలు ఎగుమతి చేస్తుంది. ఈ బొమ్మల చేతులు ` పిల్లలు ఆడుతున్న సమయంలో ఊడిపోయి వారి నోట్లో అడ్డం పడవచ్చని వారికి ప్రమాదం జరగవచ్చని అమెరికా భావించి వీటిని నిషేధించింది.
వారానికో బోరుబావి లో పసిపిల్లలు పడిపోతూ ఉంటే.. కనీసం తవ్వి వదిలేసే బోరు బావుల విషయంలోనే ఎలాంటి చట్టాలూ తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే ప్రభుత్వాలున్న మనదేశంలో .. అమెరికాలో పిల్లలకోసం చట్టాలు ఇంత తీవ్రంగా పనిచేస్తాయంటే ఆశ్చర్యంగానే ఉంటుంది.