: చంద్రబాబుపై కాంగ్రెస్ సీనియర్ ప్రశంసలు!... రేపే టీడీపీలో చేరతానని గాదె ప్రకటన
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. గుంటూరు కేంద్రంగా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన గాదె... చంద్రబాబు పాలనను మెచ్చుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం హోదాలో చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయని గాదె అన్నారు. రేపు గుంటూరులో చంద్రబాబును కలుస్తానని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు సమక్షంలోనే తాను టీడీపీలో చేరతానని కూడా గాదె వెంకటరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోగా... రెండున్నరేళ్ల పాటు క్రియాశీల రాజకీయాలకు గాదె దూరంగా ఉన్నారు. రెండు, మూడు రోజుల క్రితం తిరిగి యాక్టివేట్ అయిన గాదె... టీడీపీలో చేరేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో మంచి ముహూర్తం కోసం వేచి చూశారు. రేపు సుముహూర్తం ఉందని భావించిన గాదె కొద్దిసేపటి క్రితం గుంటూరులో మీడియా ముందుకు వచ్చారు. రేపు ఆయన అధికారికంగా టీడీపీలో చేరనున్నారు.