: కర్నూలు పొలికేకలతో దద్దరిల్లిన బెజవాడ... బుడ్డా చేరికకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
విజయవాడ నగరం కొద్దిసేపటి క్రితం కర్నూలు జిల్లా పొలికేకలతో దద్దరిల్లింది. వైసీపీ కర్నూలు జిల్లా కన్వీనర్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కొద్దిసేపటి క్రితం టీడీపీలో చేరిపోయారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. బుడ్డా రాజశేఖరరెడ్డి తండ్రి బుడ్డా వెంగళరెడ్డి గతంలో టీడీపీలోనే కొనసాగారు. దివంగత సీఎం ఎన్టీఆర్ హయాంలో ఆయన మంత్రిగానూ వ్యవహరించారు. వెంగళరెడ్డి పెద్ద కుమారుడు, రాజశేఖరరెడ్డి సోదరుడు బుడ్డా సీతారామిరెడ్డి కూడా ఓ దఫా టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగారు. వెరసి మొన్నటి ఎన్నికలకు కాస్తంత ముందు వరకు బుడ్డా ఫ్యామిలీ టీడీపీలోనే ఉంది. అయితే రాష్ట్ర విభజన, మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా బుడ్డా రాజశేఖరరెడ్డి... వైసీపీలో చేరిపోయారు. దీంతో ఆది నుంచి టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న కార్యకర్తలు... బుడ్డా వైసీపీలో చేరడంతో ఆయనను వదులుకోలేక అయిష్టంగానే వైసీపీకి మద్దతుగా నిలిచారు. గడచిన ఎన్నికల్లో బుడ్డాకు విజయం దక్కినా... వైసీపీకి షాకిస్తూ టీడీపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. దీంతో బుడ్డా తిరిగి టీడీపీ వైపు చూశారు. ఈ క్రమంలో గతంలో టీడీపీ ఫ్యామిలీకి చెందిన బుడ్డాకు చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ విషయం తెలుసుకున్న బుడ్డా అనుచరుల ఆనందం కట్టలు తెంచుకుంది. బుడ్డా నుంచి ఆహ్వానం అందకున్నా... ఆయనకు చెప్పాపెట్టకుండానే పెద్ద సంఖ్యలో విజయవాడకు తరలివచ్చారు. టీడీపీలో బుడ్డా చేరిక కోసం ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బుడ్డా మెడలో చంద్రబాబు టీడీపీ కండువా కప్పగానే వారిలో ఉత్సాహం కట్టలు తెంచుకుంది. టీడీపీకే కాకుండా బుడ్డాకు అనుకూలంగా వారంతా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతం నినాదాలతో హోరెత్తింది. ఆ తర్వాత అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, బుడ్డా ప్రసంగాల సందర్భంగానూ కార్యకర్తలు నినాదాల హోరు వినిపించారు.