: సమ్మర్ లోనూ ‘కిక్’ కోసం ‘లిక్కర్’కే మందుబాబుల ఓటు!...ఏపీలో పడిపోయిన బీర్ల విక్రయాలు
వేసవి వచ్చిందంటే... మందుబాబులు బ్రాందీ, విస్కీకి టాటా చెప్పేస్తారు. ‘బీరు’ బాట పడతారు. ఇప్పటిదాకా ఆబ్కారీ శాఖ గణాంకాలు లెక్కలు వేసి చెబుతున్న విషయమిదే. అయితే అందుకు భిన్నంగా నవ్యాంధ్రప్రదేశ్ లోని మందుబాబులు సరికొత్త మార్గం పట్టారు. సమ్మర్ లోనూ ‘కిక్’ కోసం.. వారు ‘లిక్కర్’ బాటే పట్టారు. ఇదేదో మనం చెబుతున్న విషయం కాదు. సాక్షాత్తు ఆబ్కారీ శాఖ లెక్కలేసి మరీ తేల్చిన విషయం. అసలు విషయంలోకి వస్తే... ఈ సమ్మర్ లో నవ్యాంధ్రలోని సగానికి పైగా జిల్లాల్లో బీరు విక్రయాలు 2.89 శాతం మేర పడిపోయాయి. అదే సమయంలో బ్రాందీ, విస్కీ తదితర ‘లిక్కర్’ విక్రయాలు ఏకంగా 6.35 శాతం మేర పెరిగాయి. చిత్తూరు, విశాఖ, కడప, ప్రకాశం, నెల్లూరు, ఉభయగోదావరి జిల్లాల్లో ఈ తరహా కొత్త లెక్కలు నమోదయ్యాయి. ఇక కర్నూలు, అనంతపురం, కృష్ణా, విజయనగరం జిల్లాలో బీర్ల విక్రయాలు కాస్తంత పెరిగినా... అంతకంటే ఎక్కువగా లిక్కర్ విక్రయాల్లో వృద్ధి నమోదైంది. గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం మందుబాబులు సమ్మర్ ను... ‘కూల్’గానే పరిగణిస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లోనే ఈ సమ్మర్ లో లిక్కర్ విక్రయాలు తగ్గగా, బీర్ల అమ్మకాలు మాత్రం అమాంతం పెరిగాయి.