: ఢిల్లీలో సరి-బేసి ట్రాఫిక్ నిబంధనపై నిరసన.. ఓ ఎంపీ గుర్రంపై స్వారీ.. మరో ఎంపీ సైకిల్‌పై చక్కర్లు
ఢిల్లీలో వాహన కాలుష్యాన్ని నిరోధించే ఉద్దేశంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరి-బేసి విధానాన్ని భారతీయ జనతా పార్టీ నేతలు వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ పార్లమెంటు సభ్యులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. బీజేపీ ఎంపీ రామ్ ప్రసాద్ శర్మ ఈరోజు సరి-బేసి విధానానికి వ్యతిరేకంగా వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. ఆయన గుర్రంపై స్వారీ చేస్తూ పార్లమెంటుకు వచ్చారు. మరో బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ సైకిల్‌పై చక్కర్లు కొడుతూ.. సరి బేసి విధానంపై నిరసన వ్యక్తం చేశారు. అయితే తాను సరి బేసి విధానాన్ని పాటిస్తున్నానని చెప్పారు. ఈరోజు ఢిల్లీలో బేసీ సంఖ్య కార్లే రోడ్డుపైకి రావాలని నిబంధన ఉందని, తన కారు సరి సంఖ్య నంబరుతో ఉందని, అందుకే సైకిల్ పై ప్రయాణిస్తున్నానని మీడియాకు తెలిపారు. పార్లమెంట్‌కు చేరుకోవడానికి ఎంపీలకు ఢిల్లీ ప్రభుత్వం స్పెషల్ డీటీసీ బస్ సర్వీసులని ప్రవేశపెట్టిన పెట్టిన సంగతి తెలిసిందే. వాటిని బీజేపీ ఎంపీలు వాడుకోవడం లేదు.