: అగస్ట్ వెస్ట్ ల్యాండ్ కేంద్రంగా బీజేపీ దాడికి సిద్ధం... తిప్పికొట్టేందుకు సోనియా గాంధీ వ్యూహం


ఉత్తరాఖండ్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ఆసరా చేసుకుని తనపై దాడికి దిగుతున్న విపక్షం కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ సర్కారు... అగస్ట్ వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం సహా ఎయిర్ సెల్ మ్యాక్సిస్, ఇష్రత్ జహాన్ కేసులను ఆస్త్రంగా ఎంచుకుంది. నిన్నటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఉత్తరాఖండ్ సంక్షోభాన్ని కేంద్రంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ బీజేపీ సర్కారుపై ముప్పేట దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమపై ఎదురుదాడికి దిగేందుకు బీజేపీ చేస్తున్న యత్నాలను ముందే పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పక్కా వ్యూహాన్ని రచించారు. ఇందుకోసం ఆమె నేటి ఉదయం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని అత్యవసరంగా నిర్వహించారు. బీజేపీ కంటే ముందే... ఈ అంశాలను సభలో లేవనెత్తడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పడేయాలని సోనియా చేసిన సూచన బాగానే పనిచేసినట్లుంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన రాజ్యసభ సమావేశాల్లో భాగంగా బీజేపీ కంటే ముందుగానే స్పందించిన కాంగ్రెస్ పార్టీ... అగస్ట్ వెస్ట్ ల్యాండ్ వ్యవహారంపై చర్చకు నోటీసు ఇచ్చింది. ఈ క్రమంలో దీనిపై మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్... ఈ వ్యవహారానికి సంబంధించి తమ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని బల్లగుద్ది మరీ చెప్పారు. అంతేకాకుండా తమపై వచ్చిన ఆరోపణలకు తమ పార్టీ ఎప్పుడో వివరణ ఇచ్చిందని కూడా ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News