: టీడీపీనా?... బీజేపీనా?: మైసూరా నిర్ణయంపై సర్వత్ర ఆసక్తి
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి ఆ పార్టీకి మరికాసేపట్లో గుడ్ బై చెప్పనున్నారు. ఈ మేరకు మైసూరా నుంచి సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులంతా ఇప్పటికే హైదరాబాదులోని ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. గడచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే టీడీపీని వీడి వైసీపీలో చేరిన మైసూరారెడ్డి... పార్టీలో కొంతకాలం పాటు క్రియాశీలకంగా పనిచేశారు. అయితే గత కొంతకాలంగా ఆయన దాదాపుగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం మానేశారు. అసలు పార్టీ కార్యాలయానికి కూడా ఆయన వచ్చిన దాఖలా లేదు. ఈ క్రమంలో నేటి ఉదయం వైసీపీకి మైసూరా రాజీనామా చేయనున్నట్లు వినిపించిన వార్తలతో తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు తెరలేచింది. వయసు మీద పడ్డ కారణంగానే మైసూరా పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేదన్న వాదన మొన్నటిదాకా వినిపించింది. అయితే వైసీపీకి వీడ్కోలు పలికేందుకు ఆయన సన్నద్ధమవడంతో... తదుపరి ఆయన ఏ పార్టీలో చేరతారన్న అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రస్తుతం ఏపీలో వైసీపీతో పాటు మరో రెండు పార్టీలే ప్రధాన పార్టీలుగా కొనసాగుతున్నాయి. వాటిలో అధికార టీడీపీ ఒకటి కాగా, రెండోది ఆ పార్టీ మిత్రపక్షం బీజేపీ. కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నా... రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ పార్టీలో చేరే సాహసం ఎవరూ చేయరు. ఇక మిగిలింది టీడీపీ, బీజేపీలే. దివంగత సీఎం, జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో సుదీర్ఘ కాలంగా రాజకీయ వైరం కొనసాగించిన మైసూరారెడ్డి... చాలా కాలం పాటు కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ సీఎం అయ్యాక... టీడీపీలో చేరారు. టీడీపీలోనూ క్రియాశీలక పాత్ర పోషించిన మైసూరా... గడచిన ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. జగన్ సొంత జిల్లా కడపకే చెందిన నేతగానే కాక జగన్ సామాజిక వర్గానికే చెందిన నేతగా మైసూరా రెడ్డి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారని అంతా భావించారు. అయితే అది మున్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. మరి ఇప్పుడు వైసీపీని వీడుతున్న మైసూరా భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఏ పార్టీలో చేరతారు? టీడీపీలోనా?, బీజేపీలోనా? అన్నది నేటి సాయంత్రానికి తెలిసిపోనుందని సమాచారం.