: గొట్టిపాటి ఫ్లెక్సీలు ధ్వంసం!... అద్దంకిలో హైటెన్షన్!
ప్రకాశం జిల్లా అద్దంకిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అద్దంకి నియోజకవర్గం నుంచి గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై బరిలోకి దిగి విజయం సాధించిన గొట్టిపాటి రవికుమార్ నేడు భారీ అనుచరగణంతో కలిసి విజయవాడలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో అద్దంకితో పాటు విజయవాడలో భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే అద్దంకిలో ఏర్పాటు చేసిన పలు ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు నిన్న ధ్వంసం చేశారు. తమ ఫ్లెక్సీలు ధ్వంసమైన విషయాన్ని నేటి ఉదయమే గుర్తించిన గొట్టిపాటి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ముందు జాగ్రత్త చర్యల కింద భారీ సంఖ్యలో పట్టణంలో మోహరించారు. టీడీపీలోకి గొట్టిపాటి ఎంట్రీని ఆ పార్టీ సీనియర్ నేత కరణం బలరాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో కరణం వర్గమే గొట్టిపాటి ఫ్లెక్సీలను ధ్వంసం చేసి ఉంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గొట్టిపాటి, కరణం వర్గాలు ఎక్కడ ఘర్షణకు దిగుతాయోనన్న అనుమానంతోనే పోలీసులు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగారు. దీంతో పట్టణంలో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.