: అనేక కారణాలతో రకరకాల వాళ్లు టీడీపీలోకి వస్తున్నారు: కరణం బలరాం
అనేక కారణాలతో రకరకాల వాళ్లు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని ప్రకాశం జిల్లా టీడీపీ నేత కరణం బలరాం అన్నారు. అక్రమ సంపాదనలను కాపాడుకునేందుకని కొందరు పార్టీలోకి వస్తున్నారని ఆయన ఆరోపించారు. విజయవాడలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొత్తగా పార్టీలోకి వచ్చేవారు ఇప్పుడొచ్చి అజమాయిషీ చేస్తే కుదరదని అన్నారు. ఆయా నేతలను పార్టీలో చేర్చుకునే సమయాల్లో అక్కడి నియోజకవర్గాల నేతలతో ముందుగా చర్చించడం ఆనవాయితీ అన్నారు. అయితే, అద్దంకిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందన్నారు. కాగా, ప్రకాశం జిల్లా అద్దంకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ రేపు టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. కరణం బలరాంకు, గొట్టిపాటితో కొన్నేళ్లుగా వైరం ఉన్న విషయం తెలిసిందే.