: బురఖాతో పరీక్ష రాసేందుకు కేరళ హైకోర్టు గ్రీన్ సిగ్నల్


ముస్లిం యువతులు బురఖా ధరించేందుకు కేరళ హైకోర్టు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది కూడా కొన్ని షరతుల మేరకే. ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ - 2016 పరీక్షను బురఖాతో వెళ్లి రాసేందుకు ఈ అనుమతి మంజూరు చేసింది. అయితే బురఖాతో వెళ్లేవారు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని నిర్దేశించింది. ఇన్విజిలేటర్లకు అనుమానం వస్తే అవసరమైతే వారిని సోదా చేసేందుకు వీలుగా సెంటర్ కు ముందుగా వెళ్లాలని షరతు విధించింది. ఈ మేరకు జస్టిస్ మొహమ్మద్ ముస్తక్ తీర్పు చెప్పారు. ఆల్ ఇండియా ప్రీ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ -2016 పరీక్షకు సీబీఎస్ఈ డ్రెస్ కోడ్ విధించడాన్ని సవాలు చేస్తూ బషీర్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారించింది. ఈ నిబంధనలు తమ మత విశ్వాసాలు, ఆచారాలను ఉల్లంఘించేట్టుగా ఉన్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... ముస్లిం యువతులు బురఖాలతో పరీక్ష రాసేందుకు అనుమతించాలని ఆదేశించారు. గతేడాది కూడా సీబీఎస్ఈ ఇదేవిధంగా నిబంధనలు విధించగా బురఖాలతో అనుమతించాలని కేరళ హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం అప్పుడూ ఇలానే ఆదేశించింది.

  • Loading...

More Telugu News