: మద్యం, మగువ, లగ్జరీ కార్లు!... ఆరోగ్యం విషమించిన ‘డాన్’పై ఇంటరెస్టింగ్ కథనాలు!
ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం ప్రమాదకర స్థాయికి చేరింది. బ్రతకాలంటే రెండు కాళ్లు తీసేయాలి, లేదంటే కొద్దికాలమే బ్రతికేది... ఇదీ ప్రస్తుతం కరాచీలోని తన సొంతింటిలో బెడ్డుపై కదలలేని స్థితిలో ఉన్న దావూద్ పరిస్థితి. ఈ క్రమంలో మొన్నటిదాకా దావూద్ గడిపిన విలాసవంతమైన జీవితంపై పలు మీడియా సంస్థల్లో ఆసక్తికర కథనాలు ప్రసారమవుతున్నాయి. 1993లో ముంబైలో మారణహోమం తర్వాత పాకిస్థాన్ పారిపోయిన దావూద్... ఆ దేశ వాణిజ్య రాజధాని కరాచీలో ఆ దేశ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) పూర్తి సంరక్షణలో నిశ్చింతగా జీవనం సాగించడం ప్రారంభించాడు. కరాచీని కేంద్రంగా చేసుకుని అతడు ప్రపంచంలోని పలు దేశాల్లో తన గ్యాంగ్ ను విస్తరించాడు. వందలు, వేల కోట్ల ధనాన్ని పోగేశాడు. భారీ ఎత్తున ఆస్తులు కొన్నాడు. వెరసి అతడు ఏకంగా ఓ నేర సామ్రాజ్యాన్నే నిర్మించుకున్నాడు. 2001లో పాకిస్థాన్ కు చెందిన జర్నలిస్ట్ గులాం హస్నైన్... దావూద్ జీవన శైలికి సంబంధించిన సమగ్ర సమాచారంతో ఓ సంచలన కథనాన్ని రాశారు. ‘న్యూస్ లైన్’ పత్రికలో ప్రచురితమైన ఆ కథనంతో ఆ తర్వాత హస్నైన్ తీవ్ర విపత్కర పరిస్థితులే ఎదుర్కొన్నారు. న్యాయ విచారణల పేరిట ఐఎస్ఐ హస్నైన్ ను నానా ఇబ్బందుల పాల్జేసింది. ఇక ఆ కథనంలో హస్నైన్... దావూద్ గురించి ఏమేం రాశారన్న విషయానికొస్తే... దావూద్ నివాసం ఉండే భవంతి 6 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందట. అందులో స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్టు, స్నూకర్ రూం, హైటెక్ జిమ్ తదితరాలున్నాయి. సదరు విశాల భవంతిలో మహారాజులా రాజసం ఒలకబోసిన దావూద్... నిత్యం డిజైనర్ దుస్తుల్లోనే కనిపించేవాడు. ఇక అతడికి లగ్జరీ కార్లంటే మహా వ్యామోహమట. ఈ క్రమంలోనే అతడి గ్యారేజీలో మెర్సిడెజ్ బెంజ్ కంపెనీకి చెందిన కార్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. మద్యం, మగువ అన్నా అమితాసక్తి చూపే దావూద్... వేశ్యల కోసం డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. ఇక మద్యం విషయానికొస్తే... బ్లాక్ లేబుల్ విస్కీని ఇష్టంగా సిప్ చేసేవాడు. ప్రస్తుతం ఈ అవలక్షణాలన్నింటి కారణంగా గ్యాంగ్రీన్ అనే వ్యాధిని కొని తెచ్చుకున్న దావూద్... బెడ్ పై కదలలేని స్థితిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.