: పీఏసీ చైర్మన్ గా బుగ్గన నియామకం!... అధికారికంగా ప్రకటించిన కోడెల


ఏపీ అసెంబ్లీ ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) చైర్మన్ గా వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బుగ్గనను పీఏసీ చైర్మన్ గా నియమిస్తూ నిన్న అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించారు. ప్రధాన ప్రతిపక్షానికి చెందిన సభ్యుడికి దక్కే ఈ పదవిలో మొన్నటిదాకా బుగ్గన జిల్లాకే చెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కొనసాగారు. అయితే వైసీపీని తన సొంత గూడు టీడీపీకి చేరే క్రమంలో భూమా ఆ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో భూమా స్థానంలో బుగ్గనను ఎంపిక చేసిన విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పీకర్ కార్యాలయానికి లేఖ రాశారు. ఈ మేరకు బుగ్గనను పీఏసీ చైర్మన్ గా నియమిస్తూ స్పీకర్ ప్రకటన విడుదల చేశారు. ఇక అంచనాల కమిటి (ఎస్టిమేట్స్ కమిటీ) చైర్మన్ గా టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ గా అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావులను స్పీకర్ నియమించారు. ఈ మూడు పదవులను భర్తీ చేస్తూ నిన్న అసెంబ్లీ ఇన్ చార్జీ కార్యదర్శి సత్యనారాయణ బులెటిన్ విడుదల చేశారు.

  • Loading...

More Telugu News