: రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబసభ్యులకు కేసీఆర్ ‘నో అపాయింట్ మెంట్’
దివంగత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబసభ్యులకు, కాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్ మెంట్ లభించలేదు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని పోటీకి దించే విషయమై పునరాలోచించాలని కేసీఆర్ కు విజ్ఞప్తి చేసేందుకని వారు ఈరోజు అపాయింట్ మెంట్ కోరారు. ‘సీఎంకు సమయం లేదంటూ’ ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల నుంచి వారికి సమాధానం వచ్చింది. కాగా, పాలేరు ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు సహకరించాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు రాంరెడ్డి వెంకటరెడ్డి భార్య సుచరితా రెడ్డి నిన్న ఒక లేఖ రాశారు. ఖమ్మం జిల్లాకు తన భర్త చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ పోటీ నుంచి విరమించుకోవాలని ఆ లేఖలో కోరినట్లు సమాచారం.