: ఇంకుడు గుంతలపై ప్రస్తావిస్తే చాలా మంది అవహేళన చేశారు: చంద్రబాబు
ఇంకుడు గుంతలపై గతంలో తాను ప్రస్తావిస్తే చాలా మంది అవహేళన చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నీరు-చెట్టు కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఆయన కడప జిల్లాలో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో బల్లిగుట్ట చెరువు గ్రామంలో ప్రసంగించిన అనంతరం జిల్లాలోని మరో గ్రామంలో నీటి సంఘాల అధ్యక్షులు, అధికారులతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నీటి ప్రాధాన్యతను ప్రతీ ఒక్కరూ గుర్తించాలని సూచించారు. పెద్ద ఎత్తున పంటకుంటలు తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇంకుడు గుంతలపై గతంలో తాను ప్రస్తావిస్తే చాలా మంది అవహేళన చేశారని, కానీ దాని ఫలితం ఏంటో వారికి ఇప్పుడు తెలుస్తోందని అన్నారు. నీరు చెట్టు కార్యక్రమం ద్వారా ప్రజల్లో చాలావరకు అవగాహన తీసుకొచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. చాలా ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలను పెంచుకోవాలంటే వర్షపు నీటిని కాపాడుకోవాలని సూచించారు.