: తోడికోడలు నుంచి అరుదైన పొగడ్తలు అందుకున్న సోనియాగాంధీ
తన తోడికోడలు, దివంగత సంజయ్ గాంధీ సతీమణి, బీజేపీ నేత మేనకా గాంధీ నుంచి సోనియా పొగడ్తలను అందుకున్నారు. ప్రస్తుతం కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రిగా ఉన్న మేనక, అవినీతిని అరికట్టడంలో, బంధుప్రీతికి అడ్డుకట్ట వేయడంలో సోనియా ఆదర్శప్రాయురాలని అన్నారు. తన నియోజకవర్గం పిలిభిత్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మేనకా ప్రసంగిస్తూ, గతంలో సోనియాగాంధీ బంధువు ఒకరు ఓ షాపును ప్రారంభించి, ఆమె పేరును వాడుకుని లబ్ధి పడాలని చూస్తే, దాన్ని ఆమె అడ్డుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆ వ్యక్తికి ఎలాంటి సాయమూ చేయవద్దని దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని, ప్రతి రాజకీయ నేతా అదే విధంగా బంధుప్రీతికి దూరంగా ఉండాలని కోరారు. ఇక అవకాశం దొరికినప్పుడల్లా సోనియాపై విమర్శలు గుప్పిస్తుండే, మేనకాగాంధీ, ఇలా పొగడ్తలతో ముంచెత్తడం రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తి రేకెత్తేలా చేసింది.