: భూములిచ్చిన రైతులకు పాదాభివందనాలు: చంద్రబాబు
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు. నేటి తెల్లవారుజామున వేద పండితులు నిర్దేశించిన సుముహూర్తం 4.01 గంటలకు వెలగపూడిలో తాత్కాలిక సచివాలయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న రెండు గదులకు చంద్రబాబు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు సుదీర్ఘంగా ప్రసంగించారు. రాజధాని గ్రామాలకు చెందిన ఓ రైతు మాట్లాడేందుకు యత్నించగా, చంద్రబాబు అందుకు అనుమతించారు. గతంలో పొలమిచ్చేందుకు తాను అంగీకరించలేదని, అయితే ఇప్పుడు రాజధాని కోసం తన భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆ రైతు తెలిపాడు. రైతు ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు... నిబంధనల మేరకు ప్రతిఫలం అందేలా చూస్తామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కూడా లేని రాష్ట్రంగా ఏర్పడ్డ నవ్యాంధ్రప్రదేశ్ కు సరికొత్త రాజధానిని నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ఇందుకోసం తమ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికకు రైతులు మద్దతు పలకడం హర్షించదగ్గ విషయమన్నారు. భూములిచ్చి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన రైతులకు పాదాభివందనం చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి హాజరైన రైతుల నుంచి వినిపించిన ఓ మాటకు స్పందించిన చంద్రబాబు... వెలగపూడి రైతులకు మాత్రమే తాను పాదాభివందనం చేయడం లేదని, రాజధాని ప్రాంతంలోని మొత్తం 29 గ్రామాల రైతులకు పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు.