: నవ్యాంధ్ర తాత్కాలిక సచివాలయం ప్రారంభం... తెల్లవారుజామునే ఓపెన్ చేసిన చంద్రబాబు


నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో తాత్కాలిక సచివాలయానికి ప్రారంభోత్సవం జరిగిపోయింది. రాజధాని ప్రాంతం అమరావతిలో నిర్మాణం పూర్తిచేసుకున్న రెండు గదులను, వేద పండితులు నిర్దేశించిన ముహూర్తానికి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో రాజధాని అమరావతి కోసం నిర్దేశించిన ప్రదేశంలోని వెలగపూడిలో ప్రస్తుతం తాత్కాలిక రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. సమీపంలో మంచి రోజులు లేని నేపథ్యంలో తాత్కాలిక రాజధానికి నేటి తెల్లవారుజామునే ప్రారంభోత్సవం చేయాలని వేద పండితులు సూచించారు. ఇందుకు సరేనన్న చంద్రబాబు ప్రభుత్వం నేటి తెల్లవారుజాము 4.01 గంటలకు తాత్కాలిక రాజధానికి ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు నిర్మాణ సంస్థ 'ఎల్ అండ్ టీ' తాత్కాలిక సచివాలయంలోని నాలుగో బ్లాకులో రెండు గదులను సిద్ధం చేసింది. ఈ గదులకే నేటి తెల్లవారుజామున చంద్రబాబు ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభోత్సవం చేసిన వెంటనే వ్యవసాయ శాఖకు చెందిన ఫైల్ ను పరిశీలించిన చంద్రబాబు... రూ.3,250 కోట్ల రుణమాఫీకి సంబంధించిన ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు కేబినెట్ లోని మంత్రులంతా దాదాపుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తాత్కాలిక సచివాలయానికి ‘ఏపీ గవర్నమెంట్ ట్రాన్సిషనల్ హెడ్ క్వార్టర్స్’గా చంద్రబాబు నామకరణం చేశారు.

  • Loading...

More Telugu News