: కన్నయ్య కుమార్ పై విమానంలో హత్యాయత్నం!
ముంబై నుంచి పుణెకు విమానంలో ప్రయాణిస్తున్న వేళ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ పై హత్యాయత్నం జరిగింది. తనను హత్య చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడని, తన గొంతును నులిమేందుకు చూశాడని కన్నయ్య ఈ ఉదయం మీడియా ముందు సంచలన ప్రకటన చేశాడు. ఈ ఘటన తరువాత తనను విమానం దిగిపోవాలని జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది ఒత్తిడి చేశారని ఆరోపించారు. కాగా, కన్నయ్యపై దాడికి దిగిన వ్యక్తి పేరు మనాస్ జ్యోతి డేకాగా గుర్తించామని ముంబై విమానాశ్రయ భద్రతను పర్యవేక్షిస్తున్న సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఇతను టీసీఎస్ లో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడని, బీజేపీ మద్దతుదారని తెలుస్తోంది. దాడి చేసిన వ్యక్తిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదని కన్నయ్య ఆరోపించగా, ప్రయాణికుల భద్రత తమకెంతో ముఖ్యమని, ఆ కారణంగానే ముంబై ఎయిర్ పోర్టులో కొంతమందిని దించి వేయాల్సి వచ్చిందని జెట్ ఎయిర్ వేస్ తెలియజేసింది.