: ఈపని మొదలు పెట్టిందే పీవీ, వైఎస్ లు: ప్రత్తిపాటి


రాజకీయ నాయకులు పార్టీలను ఫిరాయించేలా ప్రోత్సహించింది దివంగత పీవీ నరసింహరావు, వైఎస్ రాజశేఖరరెడ్డిలేనని తెలుగుదేశం నేత ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. పీవీ హయాంలో ఏడుగురు ఎంపీలు పార్టీలను మారారని, అణు ఒప్పందం సమయంలో ఆరుగురు ఎంపీలు పార్టీ మారేందుకు లోపాయకారీ ఒప్పందాలను ఆయన కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో 'ఆపరేషన్ ఆకర్ష్'కు తెరలేపింది ఎవరో ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యానించిన ప్రత్తిపాటి, ఆనాడు 13 మంది ఎమ్మెల్యేలను వైఎస్ కొనుగోలు చేశాడని నిప్పులు చెరిగారు. అనంతపురం జిల్లా పరిషత్ లో ఫిరాయింపులను ప్రోత్సహించింది ఎవరని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే హక్కు జగన్ కు లేదని, తండ్రి ఆపరేషన్ ఆకర్ష్ చేపడితే, కొడుకు హయాంలో ఆపరేషన్ వికర్ష్ జరుగుతోందని అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం తమకు లేదని, వారంతట వారుగానే వస్తున్నారని తెలిపారు. వైకాపా తగలబడుతున్న ఇంటిలా, మునిగిపోయే పడవలా ఉన్న కారణంగానే వలసలు అధికంగా ఉన్నాయని అన్నారు.

  • Loading...

More Telugu News