: రూ. 7 కోట్లకు అమ్ముడై వచ్చిన నువ్వా మాట్లాడేది?: ఎమ్మెల్యే మణిగాంధీపై దాడికి యత్నించిన టీడీపీ సర్పంచ్
వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో ఇటీవల చేరిన కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీకి తెలుగుదేశం సర్పంచ్ నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. కర్నూలు సర్వసభ్య సమావేశం జరుగగా, ఆర్ కొంతలపాడు సర్పంచ్ సాయికృష్ణ ఒక్కసారిగా ఆగ్రహానికి గురై మణిగాంధీపై దాడికి యత్నించారు. "చంద్రబాబునాయుడికి రూ. 7 కోట్లకు అమ్ముడై తెలుగుదేశంలోకి వచ్చిన నువ్వా మాట్లాడేది? ఆ డబ్బుతో మరుగుదొడ్లు కట్టించు. ఇక్కడ నియోజకవర్గ ఇన్ చార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి ఏం చెబితే అంత. నువ్వు ఎమ్మెల్యేవు మాత్రమే. మా రెడ్డి ఏం చెబితే అధికారులు అదే వింటారు" అని ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో మణిగాంధీ ఎస్పీకి ఫోన్ చేసి తనకు రక్షణ కావాలని కోరగా, అక్కడికి చేరుకున్న పోలీసులు సాయికృష్ణను బయటకు పంపించారని తెలుస్తోంది. ఈ ఘటనతో ఎమ్మెల్యే సైతం సమావేశం ఆసాంతం ఉండలేక మధ్యలోనే వెళ్లిపోయారు.