: గాయని జానకమ్మ నా మార్గదర్శి.. గురువు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ బాషలలో పాడి.. పేరుపొందిన గాయని ఎస్.జానకి 78వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. జానకమ్మే తన మార్గదర్శి, గురువు అని బాలు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇలాంటి పుట్టిన రోజులు ఆమె మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గాయని చిత్ర కూడా జానకమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. జానకి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఫేస్బుక్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అద్భుత గాత్రంతో ఎన్నో అవార్డులు అందుకున్న జానకి ఏప్రిల్ 23,1938న గుంటూరుజిల్లాలోని పల్లపట్లో జన్మించారు. 2013 లో భారత ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని దక్షిణ భారత కళాకారులకు సరైన గుర్తింపు లభించడం లేదంటూ ఆమె తిరస్కరించిన విషయం తెలిసిందే.