: జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ పై విచారణ నిలిపివేత


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసులో ఇటీవల సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని పలు కంపెనీల నుంచి ముడుపులు రాబట్టినట్లు జగన్ పై సీబీఐ ఏకంగా 11 కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేసులపై నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది. అంతేకాక ఇవే ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులు కూడా సీబీఐ కోర్టు విచారణ పరిధిలోకే వచ్చేశాయి. ఈ క్రమంలో జగన్ అక్రమాస్తుల కేసులో కీలక వ్యక్తులుగా పరిగణిస్తున్న ఐఏఎస్ అధికారులు ఒక్కొక్కరుగా ఈ కేసు నుంచి బయటపడుతున్నారు. ఇప్పటికే నాడు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శ్యాంబాబుపై విచారణను నిలిపివేస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా నిన్న జరిగిన విచారణ సందర్భంగానూ హైకోర్టు మరో కీలక అధికారికి విచారణ నుంచి విముక్తి కల్పించింది. నాడు వైఎస్ హయాంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ పై జరుగుతున్న విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాక సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ కేసుపై జరుగుతున్న విచారణకు కూడా దాస్ హాజరుకావాల్సిన అవసరం లేదని కూడా హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

  • Loading...

More Telugu News