: ఎంతిచ్చినా చాలదా?... ఇబ్బందులున్నాయిగా మరి!: చంద్రబాబు, వెంకయ్యల మధ్య సంవాదం
ఏపీ సీఎంగా నారా చంద్రబాబునాయుడు, కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా ముప్పవరపు వెంకయ్యనాయుడు... ఇద్దరి మధ్య మంచి అనుబంధమే ఉంది. మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, బీజేపీ నేతలుగా కొనసాగుతున్న వీరు... ఒకే వేదికపై కనిపించారంటే పొగడ్తలే పొగడ్తలు. చంద్రబాబును వెంకయ్య ఆకాశానికెత్తేస్తే.. వెంకయ్యను చంద్రబాబు ప్రశంసలతో ముంచేస్తారు. అయితే నిన్న మాత్రం అందుకు భిన్నంగా వారిద్దరి మధ్య సంవాదం నెలకొంది. ఈ సంవాదం... ఏ వ్యక్తిగత విషయాల ఆధారంగానో కాదులెండి. నవ్యాంధ్ర అభివృద్ధికి సంబంధించి మాత్రమే సుమా. అసలేం జరిగిందంటే... నిన్న విజయవాడ కేంద్రంగా ఏపీ సర్కారు సీపెట్ కు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి సీఎం హోదాలో చంద్రబాబు, కేంద్ర మంత్రి హోదాలో వెంకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా మాట్లాడిన వెంకయ్య... నిధుల కోసం చంద్రబాబు చేస్తున్న భగీరథ యత్నాన్ని ఒకింత కొత్త రీతిలో ప్రస్తావించారు. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబుకు చాలా సమస్యలున్నాయి. మిగిలిన వారందరికీ అధికారిక ఆర్తి. ఈయనకు మాత్రం అభివృద్ధి ఆర్తి. ఎంత ఇచ్చినా ఇంకా కావాలని అడుగుతారు. ఉదాహరణకు... అనంతకుమార్ ఇప్పుడు ఐదు వేల కోట్లిస్తామంటే, చంద్రబాబు అది సరిపోదని పదివేల కోట్లడుగుతారు. 10 వేల కోట్లిస్తామంటే, 15 వేల కోట్లడుగుతారు. అభివృద్ధి, ప్రజల కోసం ముందుచూపుతో చంద్రబాబు ఇలా అడుగుతారు. ఇందులో ఆక్షేపించాల్సిన అవసరం లేదు. అయితే... అనేక పరిమితులు, వారసత్వంగా వచ్చిన ఆర్థిక పరిస్థితి, వివిధ రాష్ట్రాల మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం నేపథ్యంలో కేంద్రం తన వంతు కర్తవ్యం నిర్వర్తిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మాట్లాడిన చంద్రబాబు... వెంకయ్య వ్యాఖ్యలకు ప్రతిస్పందించారు. ‘‘కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు సహాయం కోరుతున్నాం. ఇప్పటికే కేంద్రం చాలా కార్యక్రమాలు చేసింది. ఇంకా సహకరించాలని కోరుతున్నాం. వెంకయ్యనాయుడు మన తరఫున పోరాడుతున్నారు. అనంతకుమార్ లాంటి కేంద్ర మంత్రులు... నవ్యాంధ్ర కొత్త రాష్ట్రం కాబట్టి చాలా వరకు సహకరిస్తున్నారు. మేము అడిగేది ఒక్కటే. అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చేవరకూ కేంద్రం నవ్యాంధ్రకు సహాయం చేయాలి’’ అని ఆయన ముక్తాయించారు.