: విదేశాల్లోనే తదుపరి ఐపీఎల్ ..?
అటు క్రికెటర్లపై కాసుల వర్షం కురిపిస్తూ, ఇటు ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను వచ్చే ఏడాది మరో దేశంలో జరపాలని గవర్నింగ్ కౌన్సిల్ భావిస్తోంది. దీనికోసం విదేశీ వేదికల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. భారత్‌లో నిర్వహిస్తోన్న ఐపీఎల్ ప్రతీసారి ఏదో ఒక అంశంతో సమస్యల్లో పడుతోంది. మహారాష్ట్రలో ఏర్పడిన కరవుతో ఈ సీజన్ ఐపీఎల్‌లో 12 మ్యాచ్‌లను మరో చోటికి తరలించారు. గత సీజన్లలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదురైన విషయం తెలిసిందే. విదేశాల్లో ఐపీఎల్ అంశంపై బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ... గవర్నింగ్ కౌన్సిల్ విదేశీ వేదికలను పరిశీలిస్తోందని చెప్పారు. విదేశాల్లో ఐపీఎల్ వేదికల అంశంలో అక్కడి సౌకర్యాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారని తెలిపారు. గతంలో 2009, 2014 సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ టోర్నీలను దక్షిణాఫ్రికా, యూఏఈలో (కొన్ని మ్యాచ్‌లు) నిర్వహించిన విషయం తెలిసిందే.