: నారా లోకేశ్ సీఎం కావడమనే అంశం అప్రస్తుతం!... యనమల సంచలన వ్యాఖ్య
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో మెరుగైన పనితీరు కనబరుస్తున్న నారా లోకేశ్ ను కేబినెట్ లోకి తీసుకోవాలన్న డిమాండ్లు నానాటికీ పెరుగుతున్నాయి. మొన్నటి ఏపీ కేబినెట్ భేటీలోనూ ఈ అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరుగుతున్న క్రమంలో పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా ఆయనను తన కేబినెట్ లోకి తీసుకునేందుకు దాదాపుగా అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక లోకేశ్ కు మంత్రి పదవి వస్తే... ఆయన కోసం తమ పదవులను త్యాగం చేస్తామని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా ప్రకటించారు. ఈ విషయంపై నిన్న చంద్రబాబు కేబినెట్ లో సీనియర్ మంత్రిగా ఉన్న ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ మంత్రి అవుతారా?, సీఎం అవుతారా? అన్న విషయం ఇప్పుడు అప్రస్తుతమే కాక అప్రాధాన్యమని కూడా యనమల వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన సందర్భంగా యనమల ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబు తర్వాత నారా లోకేశ్ సీఎం అవుతారా? అయితే ఇంతవరకు పార్టీలో నెంబర్ 2గా ఉన్న మీ పరిస్థితి ఏమిటి?’’ అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు యనమల కాస్తంత ఇబ్బందిగానే స్పందించారు. లోకేశ్ మంత్రి కావడం, ముఖ్యమంత్రి కావడమనేది అప్రస్తుత, అప్రాధాన్య అంశమని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘సీఎం పదవికేముంది... లోకేశ్ కావచ్చు. బొడ్డు వెంకటరమణ (స్థానిక మీడియా ప్రతినిధి) కావచ్చు’’ అని కూడా యనమల అన్నారు. ఈ ప్రశ్నలతో కాస్త ఇబ్బంది పడ్డ యనమల... ఉపయోగపడే ప్రశ్నలు వేయండంటూ ఒకింత అసహనానికి గురయ్యారు.